- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘కేసులో కావాలనే ఇరికించారు.. ఊళ్లో కొందరు నా మీద కుట్ర పన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఈ విషయం ఇప్పుడు కాకపోయినా, ఎప్పటికైనా తెలుస్తుంది అంటూ నాతో చెబుతూ తరచూ బాధపడేవారు’’ అని పెద్దగుండెల పోచయ్య కుమారుడు దావీద్ బీబీసీతో చెప్పారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన దావీద్, ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు.
దావీద్ తండ్రి పెద్దగుండెల పోచయ్యను ఓ హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇటీవలే నిర్దోషిగా ప్రకటించింది.
పోచయ్య చనిపోయిన ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన నిర్దోషి అంటూ తీర్పు వచ్చింది.
‘మా నాన్న నిర్దోషి అని తీర్పు వచ్చినట్లు పేపర్లో చదివేవరకు మాకు తెలియదు’ అని దావీద్ బీబీసీతో చెప్పారు.
తల్లిని చంపేశారంటూ కేసు
పెద్దగుండెల పోచయ్యను 2013 ఫిబ్రవరి 1న పోలీసులు అరెస్టు చేశారు.
తన సొంత తల్లి ఎల్లవ్వను హత్య చేశారని ఆరోపిస్తూ ఊరి పెద్దలు పోచయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే దీనికి కారణం.
ఈ కేసులో వాదనలు విన్న సిద్దిపేట కోర్టు పోచయ్యను దోషిగా తేల్చింది. 2015 జనవరి 12న ఆయనకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.
దీనిపై వెంటనే హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు పోచయ్య. ఆయన తరపున కుమారుడు దావీద్ ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
అప్పటి నుంచి హైకోర్టులో కేసుకు సంబంధించిన వాదనలు నడుస్తున్నాయి.
జైల్లో గుండెపోటుతో పోచయ్య మృతి
చర్లపల్లి జైలులో ఉండగానే 2018 ఆగస్టు 16న పోచయ్య చనిపోయారు. అప్పట్లో ఏం జరిగిందో ‘బీబీసీ’కి దావీదు వివరించారు.
‘‘ఆగస్టు 15 రాత్రి గుండెపోటు రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారులు మర్నాడు ఉదయం 9 గంటలకు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను, అమ్మ కలిసి ఆసుపత్రికి వెళ్లేసరికే ఆయన చనిపోయారు. గుండెపోటుతో చనిపోయారని మేజిస్ట్రేట్ స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో చెప్పాలని జైలు అధికారులు మాకు సూచించారు. దాంతో మాకు ఏదో అనుమానం కలిగింది. మేజిస్ట్రేట్ ముందు అలా చెప్పినా...ఆ తర్వాత హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’’ అని దావీద్ అన్నారు.
అయితే, పోచయ్య చనిపోవడానికి గుండెపోటు కారణమని ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో వచ్చింది.
దీంతో కుషాయిగూడ పోలీసులు ఈ కేసును తర్వాత కాలంలో మూసివేశారు.
సిద్దిపేట కోర్టు తీర్పు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
పోచయ్య చనిపోయి ఆరేళ్లు గడిచినా ఆయనపై నమోదైన హత్య కేసు విషయంలో హైకోర్టులో వాదనలు కొనసాగాయి.
పదేళ్లకుపైగా పెండింగులో ఉన్న కేసులను తెలంగాణ హైకోర్టు ప్రత్యేకంగా విచారిస్తోంది.
ఇందులో భాగంగా పోచయ్య పిటిషన్ జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.
పోచయ్య నేరం చేశారని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2024 జులై 25న హైకోర్టు తీర్పు చెప్పింది.
‘‘వృద్ధురాలు ఎలా చనిపోయారనేది ప్రాసిక్యూషన్ తేల్చాలి. హత్య చేశారని తేల్చాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌దే. తువాలు (టవల్)తో చంపారని ఆధారంగా చూపుతున్నా.. అందులో స్పష్టత లేదు. సీఆర్పీసీ 161 వాంగ్మూలాలు, నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించింది. ఇవి సాక్షిని ప్రశ్నించడానికే ఉపయోగపడతాయి. నేర నిరూపణకు చెల్లవు.
వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష విధించడం సరికాదు. వైద్యుడు కూడా వృద్ధురాలిది హత్యా.. ఆత్మహత్యా అనేది స్పష్టంగా చెప్పలేదు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా తీర్పులు చెప్పడం కుదరదు’’ అని హైకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది.
పోచయ్యపై గతంలో సిద్దిపేట కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
పోచయ్య చనిపోతే కోర్టుకు ఎందుకు తెలియలేదు?
పోచయ్య జైలులో ఖైదీగా ఉండగానే చనిపోయారు. ఒకవేళ ఖైదీ ఏదైనా కారణంతో చనిపోతే...అతని లేదా ఆమె అప్పీలు పెండింగులో ఉన్న కోర్టుకు ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుంది.
జైళ్లలో ఖైదీలు లేదా కేసు విచారణ దశలో ఉండగా నిందితులు మృతి చెందితే ఎప్పటికప్పుడు ఆ సమాచారం కోర్టులకు అందించాలని తెలంగాణ హైకోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు ఈ ఘటన తర్వాత జైళ్ల శాఖకు లేఖ రాశారు. అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు వేసినా సమాచారం తప్పకుండా ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది అశోక్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.
‘కేసు విచారణలో ఉన్నప్పుడు నిందితుడు చనిపోతే, హైకోర్టులో కేసు పెండింగులో ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు జైలు అధికారులు సమాచారం ఇవ్వాలి. ఇందుకుగాను ప్రత్యేకంగా లైజనింగ్ వ్యవస్థ ఉంటుంది. కేసులో నిందితులు ఒక్కరే అయినప్పుడు, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చనిపోతే కేసును మూసేస్తారు. ఈ విషయంలో జైలు నుంచి సమాచారం ఇచ్చినట్లు లేదు. దీనిపై ఏం చేయాలనేది ఆయా న్యాయస్థానాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పారు.
దీనిపై చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య బీబీసీతో మాట్లాడారు.
‘‘పోచయ్య చనిపోయిన తర్వాత ఆ సమాచారాన్ని...అంతకు ముందు విచారణ జరిగిన కోర్టులకు తెలియచేశాం. ఆయన హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లినట్లు మాకు సమాచారం లేదు. ప్రైవేటు అప్పీల్‌కు వెళ్లినట్లు ఆ తర్వాత తెలిసింది. అందుకే మాకు ఆ సమాచారం ఇవ్వలేదు. దానివల్ల పోచయ్య చనిపోయినట్లు హైకోర్టుకు సమాచారం ఇవ్వలేకపోయాం.’’ అని సమ్మయ్య చెప్పారు.
పోచయ్య చనిపోయిన కొంతకాలానికి ఈ కేసు వాదించిన న్యాయవాది సోమసుందర్ కూడా చనిపోవడంతో ఆ తర్వాత తాము అప్పీలుకు హాజరు కాలేదని పోచయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
‘నాన్న ఎంతగా కుమిలిపోయారో మాకు తెలుసు’
వ్యవసాయం చేసుకునే పోచయ్య పంటలు సరిగా పండకపోవడంతో హమాలీగా కూడా పనిచేసేవారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
పెద్దకొడుకు జయరాజ్ ఇప్పటికీ ఊళ్లోనే ఉంటూ వ్యవసాయం చూసుకుంటున్నారు. చిన్న కుమారుడు దావీద్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.
‘‘మా నాయనమ్మ అంటే నాన్నకు ఎంతో ప్రేమ. నాకు తెలిసినంత వరకు ఆమె మా ఇంటిని నడిపించేది. మా నాన్న సంపాదన కూడా తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టి ఖర్చు పెట్టమనేవారు. అంత బాగా చూసుకునేవారు. అలాంటిది మా నాయనమ్మను ఆయన ఎందుకు చంపుతారు? అని దావీద్ ప్రశ్నించారు.
తన నాయనమ్మ అప్పటికే కిందపడి సరిగా నడవలేకపోయేవారని, ఒకరోజు బాత్రూమ్‌కు వెళ్లి పడిపోయి చనిపోయారని ఆయన వెల్లడించారు.
‘‘ఆమె చనిపోయిన సమయంలో మా నాన్న అక్కడ లేరు. అయినా ఊళ్లోవాళ్లు కొందరు ఆయనతో ఉన్న మనస్పర్దల కారణంగా ఆయనపై ఆరోపణలు చేస్తూ కేసులో ఇరికించారు’’ అని చెప్పారు దావీద్.
‘‘ఊళ్లో మా నాన్న పెద్దమనిషి తరహాలో ఉండేవాడు. కేసు పెట్టాక మా నాన్న గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడారు. ఇన్ని సంవత్సరాలకు మాకు న్యాయం జరిగినా.. మా నాన్న ఎంత అవమానపడ్డారో.. ఎంత కుమిలిపోయారో మాకు తెలుసు.’’ అని అన్నారు దావీద్.
కూలీ డబ్బులు వెనక్కి వెళ్లిపోయాయి
ఖైదీగా ఉన్నప్పుడు పోచయ్య పనికి సంబంధించి కూలీ డబ్బులు కూడా తమకు అందలేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
‘‘మా నాన్నకు సంబంధించి కూలీ డబ్బులు జైలు అధికారులు పంపించారు. మనీ ఆర్డర్ అనేది మా నాన్న పేరుతోనే ఊరికి పంపించారు. ఊళ్లోకి వచ్చాక మా నాన్న చనిపోయాడని తెలుసుకుని....ఆ డబ్బులు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇవ్వలేదు. తిరిగి చర్లపల్లి జైలుకే పంపిస్తున్నామని పోస్టల్ సిబ్బంది చెప్పారు.’’ అని దావీద్ బీబీసీకి చెప్పారు.
ఈ వ్యవహారంపై సూపరింటెండెంట్ సమ్మయ్య కూడా మాట్లాడారు.
‘‘పోచయ్యకు సంబంధించిన డబ్బులు ఉన్నాయి. మనీ ఆర్డర్ వెనక్కి వచ్చాక ఆయన కుమారుడు వచ్చి కలిస్తే...ధ్రువీకరణ పత్రం (లీగల్ హెయిర్) తీసుకొచ్చి డబ్బు తీసుకెళ్లాలని చెప్పాం. ఆయన ఆ సర్టిఫికెట్ తీసుకుని రాలేదు. ఆ తర్వాత కూడా డబ్బులు తీసుకెళ్లాలని రెండు, మూడు సార్లు జైలు నుంచి ఫోన్ చేసినా స్పందన లేదు’’ అని సమ్మయ్య బీబీసీకి చెప్పారు.
దేశంలో పెండింగ్ కేసులు ఎన్ని?
దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణ దశలో చనిపోతున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి.
గతంలోనూ ఈ తరహా సంఘటనలు జరిగినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. దేశంలో కింది కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు కేసులు భారీగా పెండింగులో ఉన్నాయి.
నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ లెక్కల ప్రకారం దేశంలో 4,46,88,945 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి.
వీటిల్లో సివిల్ కేసులు 1,09,18,817 కాగా, క్రిమినల్ కేసులు 3,37,70,128 ఉన్నాయి.
కాల వ్యవధి పరంగా పెండింగులో ఉన్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే..
- ఏడాదిలోపు పెండింగ్ కేసులు -1,55,49,817
- ఏడాది నుంచి మూడేళ్లు -1,08,90,306
- మూడేళ్ల నుంచి ఐదేళ్లు -64,17,748
- ఐదేళ్ల నుంచి పదేళ్లు -79,62,924
- పదేళ్ల నుంచి 20 ఏళ్లు -36,74,938
- 20-30 ఏళ్లు -5,43,332
- 30 ఏళ్లకు పైబడి -1,02,290
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2022 లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో 42 మంది ఖైదీలు చనిపోయారు. వీరిలో తెలంగాణలో 13 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 29 మంది ఉన్నారు.
తెలంగాణలో చనిపోయిన 13 మందిలో 11 మందివి సహజ మరణాలు కాగా, ఇద్దరివి అసహజ (వేర్వేరు కారణాలు) మరణాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో చనిపోయిన వారిలో 29 మందిలో 24 మందివి సహజ మరణాలు కాగా.. మరో ఐదుగురివి అసహజ మరణాలుగా నివేదిక చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి.యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)